: తెలంగాణ ప్రభుత్వంపై భట్టీవిక్రమార్క ప్రశ్నల వర్షం
మల్లన్నసాగర్ అంశంలో పోలీసులు చేసిన లాఠీఛార్జీతో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు వెళుతోన్న టీపీసీసీ నేతలను పోలీసులు అడ్డుకోవడం పట్ల రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టీవిక్రమార్క తెలంగాణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈరోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఈ దేశంలో అంతర్భాగం కాదా? అని ఆయన అన్నారు. తమ పార్టీ నిషేధిత పార్టీనా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ నేతలు నిషేధిత వ్యక్తులా? అని అడిగారు. తాము తీవ్రవాదులమా? అని ఆయన ప్రశ్నించారు. మల్లన్నసాగర్ బాధితుల వద్దకు చేరుకొని వారిని పరామర్శించడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతని ఆయన వ్యాఖ్యానించారు. రేపు తాము డీజీపీని కలుస్తామని, అప్పటికీ తమకు న్యాయం జరగకపోతే ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు.