: ఇండియాపై కన్నేసి లాభం పొందిన యాపిల్ చీఫ్ టిమ్ కుక్!


శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందున్న భారత్, మొబైల్ మార్కెట్ విస్తరణలోనూ అదే ఘనతను దక్కించుకున్న వేళ, హైఎండ్ లగ్జరీ ఫోన్లను మార్కెటింగ్ చేస్తున్న యాపిల్, మన మార్కెట్ నుంచి మంచి లాభాలనే పొందింది. జూన్ 30తో ముగిసిన 9 నెలల కాలంలో ఇండియాలో యాపిల్ ఫోన్ అమ్మకాలు 51 శాతం పెరిగాయి. ఇదే సమయంలో రెండు సార్లు యాపిల్ చీఫ్ టిమ్ కుక్ ఇండియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆయన పర్యటన వ్యూహాత్మకంగా సాగగా, ఇండియాలో యాపిల్ రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేయడం ద్వారా తమకు వచ్చే లాభాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన భావిస్తున్నారు. "ఇండియా మా వ్యాపారానికి ఎంతో ముఖ్యం. ఇక్కడ రిటైల్ స్టోర్లు ప్రారంభించి మరింతగా విస్తరించాలని భావిస్తున్నాం" అని అనలిస్టులు, ఇన్వెస్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 15 శాతం వరకూ పతనమైన వేళ, భారత్ లో విక్రయాలు గణనీయంగా పెరగడం తనకు ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. కాగా, ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో సంస్థ యాపిల్ ఫోన్ల విక్రయాలు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 4.75 కోట్ల నుంచి 4.04 కోట్లకు తగ్గిన సంగతి తెలిసిందే. యాపిల్ కు వచ్చే మొత్తం ఆదాయంలో 60 శాతం స్మార్ట్ ఫోన్ విక్రయాల రూపంలోనే వస్తుండటంతో, భారత్ వంటి మార్కెట్ తమ విస్తరణకు అత్యంత కీలకమని టిమ్ కుక్ గట్టిగా నమ్ముతున్నారని తెలుస్తోంది. ప్రపంచం మొత్తంలో యాపిల్ కు ఒక్క ఇండియా మాత్రమే వెలుగుతున్న నక్షత్రంగా కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. వాస్తవానికి 2014-15 సంవత్సరంలో యాపిల్ ఆదాయంలో ఇండియా వాటా ఒక్క శాతం మాత్రమే. అయితే, ఇక్కడ విస్తరిస్తే, మంచి ఆదాయాన్ని సులువుగా తమ ఖాతాకు జమ వేసుకోవచ్చని భావిస్తున్న యాపిల్, అందుకు తగ్గ ఏర్పాట్లలో ఉంది.

  • Loading...

More Telugu News