: నర్సింగ్ యాదవ్ పై కుట్ర చేసింది సుశీల్ కుమారేనా?... వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం!


రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ను రియో ఒలింపిక్స్ కు దూరం చేసిన డ్రగ్స్ వెనుక మరో రెజ్లర్, ఒలింపియన్ సుశీల్ కుమారే విలన్ అని స్పష్టం చేసేందుకు ఒక్కో ఆధారమూ లభిస్తోంది. సుశీల్ కుమార్ ప్రాక్టీస్ చేసే బృందంలో సాయ్ వంటగాడు కూడా ఉండటం, పలుమార్లు సుశీల్ సోదరుడు అవసరం లేకున్నా నర్సింగ్ యాదవ్ రూమ్ వద్దకు వచ్చినట్టు తెలిసిన నేపథ్యంలో, కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. నర్సింగ్ యాదవ్ కు డోప్ పరీక్షలు చేయగా, పాజిటివ్ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో, తనకే పాపమూ తెలియదని ఆయన వాపోయిన సంగతి తెలిసిందే. నర్సింగ్ సోదరుడు వినోద్ యాదవ్, ఇప్పటికే దీని వెనుక సుశీల్ కుమార్ ఉన్నాడని ఆరోపించాడు. సోనేపత్ లోని సాయ్ కేంద్రంలో ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో ఆహారంలో నిషేధిత ఉత్ప్రేరకాలను కలిపి నర్సింగ్ కు పంపించినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో అక్కడి ఆటగాళ్లను, ఇతర సిబ్బందిని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న పోలీసులు, ఒక్కో చిక్కుముడినీ విప్పుతున్నారు. సుశీల్ సోదరుడు నర్సింగ్ రూము వద్ద తచ్చాడటంపై సాక్ష్యాలు లభించాయి. నర్సింగ్ ఆహారంలో డ్రగ్స్ కలిపినట్టు వంటవాడు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా, తనకు తీవ్ర అన్యాయం జరిగిందని, డ్రగ్స్ కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నర్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నర్సింగ్ స్థానంలో ప్రవీణ్ రాణాను రియో ఒలింపిక్స్ కు పంపుతున్నట్టు భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ఒలింపిక్ పోటీల్లో రెజ్లింగ్ కు ఎవరు పోటీ పడాలన్న విషయమై సుశీల్, నర్సింగ్ ల మధ్య పెను వివాదమే జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం కోర్టుకు వెళ్లగా, నర్సింగ్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. అందుకు ఆగ్రహంతోనే సుశీల్ ఈ పనికి ప్రోత్సహించాడా? లేదా? అన్నది తేలాల్సి వుంది.

  • Loading...

More Telugu News