: కోహినూర్ ను వెనక్కు తెప్పించేందుకు కదులుతున్న మోదీ సర్కారు!


బ్రిటీష్ పాలకుల కాలంలో భారత్ నుంచి వెళ్లిపోయిన అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని తిరిగి స్వదేశానికి చేర్చేందుకు నరేంద్ర మోదీ సర్కారు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోంది. చట్టబద్ధమైన మార్గం ద్వారా ఈ వజ్రాన్ని ఇండియా చేర్చాలని భావిస్తున్న కేంద్రం, సుప్రీంకోర్టులో తాజా అఫిడవిట్ ను దాఖలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. కోహినూర్ పై హక్కులు భారత్ వేనని తేల్చేందుకే ఈ పిటిషన్ దాఖలు చేయనున్నట్టు సమాచారం. ఆగస్టు 15లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని, ఈ మేరకు గతవారంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మోదీ తన సహచరులకు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సాంస్కృతిక మంత్రి మహేష్ శర్మ, కార్యదర్శి పీకే సిన్హా తదితరులు హాజరై కోహినూర్ ను తిరిగి వెనక్కు తెప్పించే అంశంపై చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటైన కోహినూర్ ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటంలో పొదిగున్న సంగతి తెలిసిందే. ఈ కిరీటం ఇప్పుడు టవర్ ఆఫ్ లండన్ లో ఉంది. కాగా, కోహినూర్ ను తిరిగి తీసుకువెళ్లడానికి భారత్ కు ఎలాంటి హక్కూ లేదని యూకే ఆసియా పసిఫిక్ వ్యవహారాల మంత్రి అలోక్ శర్మ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News