: కాగే నూనెలో చేతులు పెట్టి యువకుడిని ప్రమాణం చేయమన్నారు... నెల్లూరు జిల్లాలో అనాగరిక చర్య!
ఆధునిక సమాజంలోనూ అనాగరిక చర్యలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. నెల్లూరు జిల్లా చేజర్లలో తాజాగా అటువంటి ఘటనే ఒకటి జరిగింది. తాను దొంగతనం చేయలేదని ప్రమాణం చేయమంటూ చేజర్ల మండలంలోని పుట్టుపల్లి గ్రామంలో ఓ యువకుడి చేత కాగే నూనెలో చేతులు పెట్టించబోయారు. ఆత్మకూరు బీఎస్సార్ కళాశాలలో ఐటీఐ చదువుతోన్న బాధిత యువకుడు నజీర్‌బాష పుట్టుపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే ఖలీల్‌బాష, బీబీల కుమారుడు. నబీర్‌బాష నివసిస్తోన్న ఎదురింట్లో రెండు వేల రూపాయలని ఎవరో చోరీ చేశారు. ఆ దొంగతనాన్ని నజీర్‌బాషనే చేశాడని వారి ఎదురింట్లో నివాసముంటోన్న ఖాతూన్‌బీ, కుమార్తె బీబీజాన్, కొడుకు మస్తాన్‌షరీఫ్‌లు ఆరోపించారు. నజీర్‌బాషని దర్గా వద్దకు తీసుకెళ్లి బాండలిలోని నూనెలో చేతులు పెట్టించడానికి వారు ప్రయత్నించారు. అయితే, నజీర్ బంధువులు అక్కడకు చేరుకుని ఈ చర్యను అడ్డుకున్నారు. చేజర్ల పోలీస్‌స్టేషన్ లో ఈ చర్యపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.