: అమరావతిపై మేమెప్పుడైనా విమర్శలు చేశామా? అసలు రాజధానికి అంత భూమి ఎందుకు?: ఎంపీ బూర నర్సయ్య
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శల పట్ల టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీ ప్రభుత్వం చేపట్టిన పనుల్లో మేము ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు.. విమర్శలు చేయలేదు’ అని అన్నారు. అమరావతిపై మేమెప్పుడైనా స్పందించామా? అని ఆయన ప్రశ్నించారు. ‘పక్కరాష్ట్రంతో మంచి సత్సంబంధాలు ఉండాలనే మేం మీ దాంట్లో జోక్యం చేసుకోలేదు’ అని బూర నర్సయ్య వ్యాఖ్యానించారు. రాజధాని పేరుతో మీరు రైతులనుంచి ఎన్నో వేల ఎకరాల భూమి లాక్కున్నారు. ఏ చట్ట ప్రకారం తీసుకున్నారు? అని ఆయన ప్రశ్నించారు. రాజధానికి అంత భూమి ఎందుకని ఆయన దుయ్యబట్టారు. రెండు రాష్ట్రాలకు మధ్య మంచి వాతావరణం ఉండాలనే తాము కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బూర నర్సయ్య అన్నారు. ‘కచ్చితంగా ప్రాజెక్టులు కడతాం.. నీళ్లు ఇస్తాం’ అని ఆయన నొక్కిచెప్పారు. 5 జిల్లాలకు సాగు, తాగు నీరు అందించేందుకే మల్లన్నసాగర్ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. దానికి ఆటంకాలు కలిగిస్తూ ప్రతిపక్షాలు రాజకీయ చదరంగం ఆడుతున్నాయని ఆయన అన్నారు. ప్రాజెక్టులకు ప్రతిపక్ష నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణలో అధికారంలోకి రావాలని టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని నర్సయ్య ఆరోపించారు. ఆ కుట్రలో రైతులు భాగస్వామ్యం కావద్దని ఆయన సూచించారు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇలాగే వారి ధోరణి కొనసాగితే టీడీపీ నేతలను ప్రజలు గ్రామల్లోకి అనుమతించబోరని ఆయన అన్నారు. పలు గ్రామాల్లో ఇప్పటికే భూసేకరణ అయిపోయిందని, మరికొన్ని గ్రామాలను కూడా ఒప్పించే పనిలో ఉన్నామని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేయబోదని అన్నారు. నిర్వాసితులకు మెరుగైన సౌకర్యాలే కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.