: ఈ ఐస్ క్రీం కరగనే కరగదు!
ఐస్ క్రీంను వెంటనే తినకపోతే కరిగిపోవడం ఖాయమనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, ఈ కరిగిపోని ఐస్ క్రీం గురించి మాత్రం చాలామందికి తెలియదు. లండన్ కు చెందిన రాబిన్ కాలిగ్ న్ అనే ఆహార నిపుణుడు ఎంతగానో శ్రమించి ఈ కరిగిపోని ఐస్ క్రీంని తయారు చేశాడు. చివరకు, తన ఉద్యోగాన్ని, సొంత ఇంటిని కూడా వదిలిపెట్టాల్సి వచ్చింది. ఈ ఐస్ క్రీం తయారీ నిమిత్తం అమెరికా, కెనడా తదితర ప్రాంతాల్లో తిరిగి, అవసరమైన సమాచారం సేకరించాడు. ఇంత కష్టపడి తయారుచేసిన కరిగిపోని ఆ ఐస్ క్రీం పేరు ‘గ్యాస్ట్రోనట్’. ఈ సందర్భంగా రాబిన్ మాట్లాడుతూ సేంద్రీయ పద్ధతిలో తయారు చేసిన ఈ ఐస్ క్రీం.. మెక్సికన్ చాక్ లెట్ చిప్, కుకీస్ క్రీమ్, మింట్ చాక్ లెట్ లాంటి ఫ్లేవర్లలో లభిస్తుందన్నారు. అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాములకు ‘గ్యాస్ట్రోనట్’ ను ఆహారంగా అందించే నిమిత్తం స్పేస్ సెంటర్ వద్ద ప్రదర్శనకు పెట్టనున్నట్లు చెప్పారు.