: గోమాంసం తీసుకు వెళుతున్నారంటూ ఇద్దరు మహిళలపై దాష్టీకం... చోద్యం చూసిన పోలీసులు!
పోలీసులతో పాటు పదుల సంఖ్యలో ప్రజలు చూస్తుండగా, గో రక్షక దళమని చెప్పుకున్న కొందరు యువకులు ఇద్దరు ముస్లిం మహిళలను దారుణంగా కొట్టారు. ఈ దృశ్యాన్ని పలువురు తమ మొబైల్స్ లో వీడియో తీశారే తప్ప, ఎవరూ అడ్డుకోవాలని చూడకపోవడం గమనార్హం. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మంద్ సార్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడి రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు ముస్లిం మహిళలు పెద్దమొత్తంలో ఆవు మాంసాన్ని విక్రయించేందుకు తీసుకుపోతున్నారని, ఆరోపిస్తూ దాడి చేశారు. 'గో మాతాకీ జై' అంటూ వారిని కిందపడేసి కొట్టారు. చెంపలు వాయించారు. పిడిగుద్దులు గుద్దారు. చుట్టూ చూస్తున్న పోలీసులు కూడా గట్టిగా వారిని ఆపేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. దాదాపు అరగంట పాటు ఈ దారుణం జరిగింది. ఈ మొత్తం ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం స్పందించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర హోం మంత్రి భూపేంద్ర సింగ్ వెల్లడించారు. కాగా, వారి వద్ద 30 కిలోల మాంసం ఉందని, దాన్ని పరీక్షలకు పంపగా, ఆవు మాంసం కాదని, గేదె మాంసమని తేలిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మాంసం అమ్మేందుకు వారివద్ద ఎలాంటి లైసెన్స్ లేదని తెలిపారు. దాడిచేసిన వారిపై కూడా ఇంతవరకూ ఎలాంటి కేసూ నమోదు కాలేదని తెలుస్తోంది.