: ప్రమాదాన్ని శంకించిన రైతు... జెండా ఊపి, రైలును ఆపి పెను ప్రమాదాన్ని నిలువరించాడు
వర్షాల కారణంగా రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పట్టాలు గాలిలో వేలాడుతుండడాన్ని చూసిన ఓ రైతు అప్రమత్తత వందలాదిమంది ప్రాణాలను రక్షించింది. గ్రామస్తులను అప్రమత్తం చేసి రైలును ఆపి శభాష్ అనిపించుకున్నాడా రైతు. తమిళనాడులోని విల్లుపురంలో జరిగిందీ ఘటన. నేడి గ్రామస్తులు తమ మేకలు, గొర్రెలు, ఆవుల మందలను మైలామ్ రైల్వే ట్రాక్ మీదుగా నడిపిస్తూ ఆవలి ప్రాంతానికి చేరుకుంటారు. అలాగే ఆ గ్రామ రైతులు కూడా దాని మీదుగానే తమ పొలాలకు వెళతారు. ఈ క్రమంలో పలుమార్లు రైలు ఢీకొని పశువులు మృతి చెందాయి. కాపర్లూ గాయపడ్డారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో సబ్-వే నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. గత ఏడాది కాలంగా ఆ పనులు జరుగుతున్నాయి. పనులు ఏమేరకు జరుగుతున్నాయో తెలుసుకునేందుకు మంగళవారం అక్కడికి వెళ్లిన రైతు జగన్.. వర్షాల కారణంగా మట్టి కొట్టుకుపోయి గాలిలో వేలాడుతున్న పట్టాలను గమనించాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించాడు. అందరూ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈలోపు అదే ట్రాక్‌పై విల్లుపురం-తాంబారం పాసింజర్ రైలు వస్తుండడంతో అప్రమత్తమై జెండా ఊపారు. ట్రాక్‌పై వందలాదిమంది ఉండడం, జెండా ఊపడంతో కీడు శంకించిన డ్రైవర్ రైలును ఆపాడు. దెబ్బతిన్న ట్రాక్‌ను చూసి ఫొటోలు తీసి అధికారులకు పంపించాడు. స్పందించిన అధికారులు వెంటనే ట్రాక్‌కు మరమ్మతులు చేసి రైళ్లను పునరుద్ధరించారు. జగన్ కనుక ట్రాక్‌ను గుర్తించకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేదని రైల్వే అధికారులు పేర్కొన్నారు. గ్రామస్తులను, రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేసిన జగన్‌ను ఈ సందర్భంగా అభినందించారు.