: పాకిస్థాన్‌లో కొనసాగుతున్న పరువు హత్యల పరంపర.. బ్రిటన్ బ్యూటీ థెరఫిస్ట్ దారుణ హత్య!


పరువు హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాకిస్థాన్‌లో తాజాగా మరో పరువు హత్య జరిగింది. పాక్ మోడల్ ఖండీల్ బలోచ్ హత్యను మర్చిపోకముందే అటువంటిదే మరో ఘటన తెరపైకి వచ్చింది. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక్క కారణంతో బ్రిటన్‌కు చెందిన బ్యూటీ థెరఫిస్ట్ సమియా షాహిద్‌(28)ను దారణంగా హతమార్చారు. బ్రాడ్‌ఫోర్డ్‌కు చెందిన సమియా భర్తతో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. ఇటీవల పంజాబ్‌ ప్రావిన్స్ లోని పండోరి గ్రామంలో తన బంధువుల ఇంటికి వచ్చిన ఆమె అక్కడే మృతి చెందింది. ఆమె మృతి మిస్టరీగా మారడంతో రీ పోస్టుమార్టం కోసం డిమాండ్‌లు వెల్లువెత్తుతున్నాయి. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందనే అక్కసుతోనే ఆమెను చంపేశారని సమియా భర్త ముఖ్తార్ కాజం ఆరోపించారు. అయితే ఆమె హార్ట్ ఎటాక్‌తో మరణించిందని సమియా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె మృతి చెందిన వెంటనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె మృతిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో స్పందించిన పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. సమియా శరీరంపై ఎటువంటి గాయాలు లేవని పేర్కొన్నారు. 2014లో సమియాను వివాహం చేసుకున్న ముఖ్తార్.. తన భార్య పూర్తి ఆరోగ్యంగా ఉందని, హార్ట్‌ఎటాక్ వచ్చే అవకాశమే లేదని తేల్చి చెబుతున్నారు. తమ వివాహంతో పూర్తి అసంతృప్తిగా ఉన్న ఆమె కుటుంబ సభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News