: కేజీ గ్యాస్ మనకే.. కాదూ కూడదంటే పైపులైన్ల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తా: చంద్రబాబు


కృష్ణా-గోదావరి(కేజీ) బేసిన్ నుంచి ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను మొదట ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోమారు స్పష్టం చేశారు. కాదూకూడదని బయటకు తరలిస్తే పైపుల నుంచి గ్యాస్ ఎలా వెళ్తుందో చూస్తామని చమత్కరించారు. చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం విజయవాడలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేజీ బేసిన్ గ్యాస్, పుష్కరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలించడం వల్ల రాష్ట్రంలోని గ్యాస్ ఆధారిత విద్యుత్ సంస్థలు, ఫెర్రో అల్లాయిస్ యూనిట్టు, ఎరువుల కర్మాగారాలు తీవ్రంగా నష్టపోతున్నాయన్నారు. ఇటీవల తాను ఢిల్లీ వెళ్లినప్పుడు ఇదే విషయాన్ని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వద్ద ప్రస్తావించానన్నారు. గతేడాది గోదావరి పుష్కరాల కోసం వందకోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం ఈసారి పైసా కూడా విదిలించకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో ప్రాధాన్యమున్న పుష్కరాలను కేంద్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పుష్కర పనులను నామినేషన్ ద్వారా కేటాయించడంపై అధికారులపై మండిపడ్డారు. టెండర్ పిలిచి ఇవ్వాల్సిందని, ఎందుకు అలా చేయలేదని ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను ప్రశ్నించారు. తగినంత సమయం లేకపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని ఆయన బదులిచ్చారు. పుష్కర పనులు వచ్చే నెల 3వ తేదీకల్లా పూర్తికావాల్సిందేనని ఆదేశించారు. సమావేశంలో మంత్రుల ఫేస్‌బుక్ ఖాతాలపైనా చర్చ జరిగింది. ఎంతమందికి ఫేస్‌బుక్ అకౌంట్లు ఉన్నాయన్న చంద్రబాబు ప్రశ్నకు తామందరికీ ఉన్నాయని మంత్రులు బదులిచ్చారు. ఎంతమంది రోజూ వాటిని అప్‌డేట్ చేస్తున్నారని సీఎం ప్రశ్నించగా తాము రోజూ పోస్టింగులు చేస్తున్నట్టు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు తెలిపారు. తనకు 70వేల మంది ఫాలోవర్లు ఉన్నారని గంటా చెప్పగా, 50 వేలమంది తన ఖాతాను అనుసరిస్తున్నట్టు అచ్చెన్నాయుడు చెప్పారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు మరింత చేరువయ్యేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

  • Loading...

More Telugu News