: యూపీ ప్రజలు 27 ఏళ్లు మోసపోయారు... రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది?: రాజ్ బబ్బర్
27 ఏళ్లపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ పార్టీలు నాశనం చేశాయని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ రాజ్ బబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన 27 సాల్-యూపీ బేహాల్ యాత్ర యూపీని చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, సమాజ్ వాదీ, బహుజన సమాజ్ పార్టీలు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించాయని అన్నారు. అత్యధిక ఎంపీలను గెలిపించిన యూపీ ప్రజలకు బీజేపీ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. యూపీని ఢిల్లీలా మార్చగల సామర్థ్యం షీలా దీక్షిత్ కు మాత్రమే ఉందని ఆయన తెలిపారు. మొఘలులు, ఆంగ్లేయులు పాలించిన ఢిల్లీని ఆమె సుందరంగా తీర్చిదిద్దారని ఆయన గుర్తుచేశారు. కులరాజకీయాలను విశ్వసించని కాంగ్రెస్ పార్టీని యువకులు ఆదరించాలని ఆయన సూచించారు.