: లండన్ లో డ్రోన్స్ ద్వారా జైలు ఖైదీలకు డ్రగ్స్ సరఫరా
సాంకేతిక విప్లవంలో భాగంగా ఇటీవలి కాలంలో డ్రోన్లు (పైలట్ రహిత చిన్న విమానాలు) రంగప్రవేశం చేసిన సంగతి విదితమే. డ్రోన్ల ఉపయోగాలు గుర్తించిన 'అమెజాన్' కంపెనీ తన వస్తువులను డ్రోన్ల ద్వారా డెలివరీ చేస్తోంది. దీనినే లండన్ లోని ఓ డ్రగ్ పెడ్లర్ తన వ్యాపారానికి అనుకూలంగా మార్చుకున్నాడు. యూకేకు చెందిన డానియల్ కెల్లీ అనే డ్రగ్ పెడ్లర్ ఓ డ్రోన్ ను కొనుగోలు చేసి, దాని సాయంతో జైళ్లలో ఉన్న ఖైదీలకు టొబాకో, డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. 24 గంటల పర్యవేక్షణ ఉండే జైల్లో ఖైదీలు డ్రగ్ బానిసలుగా మారడం పట్ల నిఘా వేసిన సిబ్బంది, డ్రోన్ ద్వారా ఖైదీలకు టొబాకో, డ్రగ్స్ సరఫరా అవడాన్ని గుర్తించి, కాపుకాసి ఆ వ్యాపారని పట్టేశారు. అతనిని విచారించిన సందర్భంలో అతను చెప్పిన వివరాలు విని షాక్ కు గురయ్యారు. అతను నాలుగు జైళ్లకు ఇలా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలుసుకున్నారు. దీనిపై విస్మయం వ్యక్తం చేసిన పోలీసులు, డ్రగ్స్ సరఫరా వల్ల ఖైదీలు సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని, ఇవే డ్రోన్ల ద్వారా ఖైదీలకు ఆయుధాలు సరఫరా చేస్తే... ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించుకోవాలని వారు సూచిస్తున్నారు. డ్రోన్ లపై నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తే భవిష్యత్ లో జైళ్లలో డ్రోన్ల సాయంతో సెల్ ఫోన్లు, తుపాకులు, ఇతర ఆయుధాలు కూడా అందుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.