: ఇప్పుడు ఆగుతాం... శుక్రవారం హోదాపై చర్చిస్తారన్న గ్యారంటీ మీరిస్తారా?: డిప్యూటీ చైర్మన్ ను సూటిగా ప్రశ్నించిన జైరాం రమేష్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై తక్షణం చర్చ జరపాలంటూ రాజ్యసభలో నిన్నటి నుంచి సాగుతున్న గందరగోళం, నేడూ సద్దుమణగలేదు. డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్, బిల్లును వచ్చే శుక్రవారం చేపడతామని పదేపదే చెబుతున్న వేళ, కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు సర్దుకుంటామని, వచ్చే శుక్రవారం బిల్లును చేపట్టి తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామన్న హామీని మీరు ఇస్తారా? అంటూ డిప్యూటీ చైర్మన్ ను సూటిగా ప్రశ్నించారు. అయితే, దీనికి కురియన్ సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఆపై వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఏపీలో ప్రధాన ప్రతిపక్షానికి చెందిన సభ్యుడిగా ఉన్న తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. అవకాశం ఇస్తానని కురియన్ హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు మెంబర్ బిల్లును నిబంధనలకు విరుద్ధంగా శుక్రవారం మినహా మరో రోజు చర్చించలేమని కురియన్ స్పష్టం చేయగా, మరోసారి కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నినాదాలతో హోరెత్తించారు.

  • Loading...

More Telugu News