: హైదరాబాద్ లో 'కిడ్నాప్-హత్య' చేసే ముఠా అరెస్టు
హైదరాబాద్ లో కిడ్నాప్-హత్య చేసే ముఠాను ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో దురాగతాలకు పాల్పడుతున్న ఈ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. పదిహేనురోజుల క్రితం ఎంజీబీఎస్ లో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన నలుగురు సభ్యులతో కూడిన ముఠా, మరో ఇద్దరిని కిడ్నాప్ చేసేందుకు యత్నిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ ముఠాలో జార్ఖండ్, బీహార్, మహారాష్ట్రకు చెందిన వ్యక్తులున్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.