: అయోధ్యలో రామమందిరం ఆనవాళ్లు శోధించిన వ్యక్తికి కీలక పదవినిచ్చిన మోదీ!


అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో 10వ శతాబ్దం నాటికే దేవాలయం ఉన్నదని అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు శోధనలు జరిపి సాక్ష్యాలను, ఆనవాళ్లను సేకరించిన పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ ముద్ధ రష్మీ మణికి నరేంద్ర మోదీ సముచిత గౌరవాన్ని కల్పించారు. ఆయనను నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగిగా ఉన్న మణి నేతృత్వంలోని బృందం అయోధ్యలో పరిశోధనలు జరిపి మసీదు కన్నా ముందే ఇక్కడ ఆలయం ఉందని తేల్చింది. ఆపై 2015లో ఆయన అడిషనల్ డీజీగా పదవీ విరమణ చేయగా, ఇప్పుడు తిరిగి ఆయన సేవలను వినియోగించుకోవాలని మోదీ భావించిన మీదట, నేషనల్ మ్యూజియం బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, తన నేతృత్వంలో వెలుగులోకి వచ్చిన ప్రతి విషయమూ వాస్తవమేనని, అయోధ్యలో దేవాలయం ఆనవాళ్లపై మరోసారి తవ్వకాలు జరిపే అవసరమే లేదని మణి వివరించారు. మోదీ వంటి డైనమిక్ వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉండటం ప్రజల అదృష్టమని పొగిడారు. బీజేపీ తనకు రివార్డులు ఇవ్వాలని భావిస్తే, పదవిలో ఉండగానే ప్రమోషన్లు ఇచ్చి ఉండేదని అన్నారు. కాగా, మణిని మూడేళ్ల పాటు మ్యూజియం డీజీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ స్టేట్స్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

  • Loading...

More Telugu News