: మిస్సింగ్ విమానం... రంగంలోకి 'సాగరనిధి', ఆపరేషన్ 'తలాష్' ప్రారంభం!


బంగాళాఖాతంలో గత శుక్రవారం నాడు 29 మందితో అదృశ్యమైన భారత వాయుసేన విమానం ఆచూకీ గురించిన ఏ చిన్న సమాచారం కూడా ఇంతవరకూ దొరకలేదు. దీంతో సెర్చ్ ఆపరేషన్ ను మరింతగా విస్తరించిన అధికారులు, బంగాళాఖాతంలోని మరింత ప్రాంతాన్ని జల్లెడ పట్టాలని నిర్ణయించి, సెర్చ్ ఆపరేషన్ కు 'తలాష్' అని పేరు పెట్టారు. ఐదో రోజు సెర్చ్ లో 17 నౌకలు, 23 విమానాలు, ఓ సబ్ మెరైన్ పాల్గొంటుండగా, సుమారు 14 వేల నాటికల్ మైళ్ల గాలింపు పరిధి విస్తీర్ణాన్ని కలిగివున్న ఆత్యాధునిక 'సాగరనిధి' స్పెషల్ షిప్ ను రంగంలోకి దించాలని నిర్ణయించారు. విమానం కూలిపోతే, ఆ వెంటనే అందులో అమర్చిన ఎమర్జెన్సీ లొకేటర్ ట్రాన్స్ మిటర్ (ఈఎల్టీ) పనిచేయడం ప్రారంభించి, దాదాపు నెల రోజుల పాటు సిగ్నల్స్ పంపుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ సిగ్నల్ ను పట్టుకునేందుకే అత్యాధునిక సోనార్ వ్యవస్థలతో విమానాలు, నౌకలు వెతుకుతున్నాయి. విమానం కూలి ఉండవచ్చని భావిస్తున్న ప్రాంతంలో సముద్రం లోతు 3.5 కిలోమీటర్ల వరకూ ఉన్నట్టు భావిస్తున్న అధికారులు, అంత లోతున నీటి పీడనం అత్యధికంగా ఉంటుందని, దాంతో ఈఎల్టీ వ్యవస్థ విచ్ఛిన్నమయ్యే అవకాశాలే అధికమని అంటున్నారు. సెర్చ్ ఆపరేషన్ కు తదుపరి రెండు రోజులూ అత్యంత కీలకమని వెల్లడించారు.

  • Loading...

More Telugu News