: టూరిస్టుగా వచ్చా... ఇలా పంజరంలో పక్షినవుతానని అనుకోలేదు: సెక్స్ రాకెట్ నుంచి పోలీసులు రక్షించిన రష్యా యువతి
ఐటీ శాఖ అధికారులు ఢిల్లీ వ్యాపారవేత్త ప్రీతీంద్రనాథ్ సన్యాల్ ఇంటిపై దాడులు జరపడంతో వెలుగులోకి వచ్చిన హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్స్ రాకెట్ లో పోలీసులకు పట్టుబడ్డ రష్యా యువతి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. సప్ధర్ జంగ్ లోని సన్యాల్ ఇంటి నుంచి ఆమెను గతవారం కాపాడగా, రష్యా రాయబార కార్యాలయం అధికారులు జోక్యం చేసుకోవడంతో పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టారు. ఆపై మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. "అజయ్ అహ్లావత్ అనే వ్యక్తి స్పాన్సర్ చేయగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 25న భారత్ వచ్చాను. బిజ్ వాసన్ ప్రాంతంలోని తన ఫామ్ హౌస్ లో ఉంచారు. అక్కడే నాకు సన్యాల్ తో పరిచయం అయింది. అతను నన్ను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. మేం భార్యాభర్తల్లానే మెలిగాం. ఆపై ఐటీ అధికారులు, ఆయుధ డీలర్లకు నన్ను పరిచయం చేసి వారికి అప్పగించేవాడు. ఓ బంగారు పంజరంలో చిక్కుకున్న నేను బయటపడే మార్గం లేక ఈ కూపంలో చిక్కుకుపోయాను. మా కుటుంబం చాలా పేదరికంలో ఉంది. డబ్బు కోసమే సన్యాల్ ను వివాహం చేసుకున్నాను. ఇలా సెక్స్ రాకెట్ లో ఇరుక్కుంటానని మాత్రం అనుకోలేదు. తిరిగి రష్యాకు వెళ్లిపోవాలని భావిస్తున్నా" అని స్టేట్ మెంట్ ఇచ్చింది. దీని ఆధారంగా మరో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆయుధ డీలర్లతో సన్యాల్ పరిచయాలపై ఆరా తీస్తున్నట్టు తెలిపారు.