: హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన రోడ్లు.. జనజీవనం అస్తవ్యస్తం
హైదరాబాద్‌లో ఈ తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. తార్నాక, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మణికొండ, దిల్‌సుఖ్‌నగర్, అమీర్‌పేట, సైదాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనజీవనం స్తంభించింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వాహనదారుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నీట మునిగిన వాహనాలు, అస్తవ్యస్తంగా మారిన ట్రాఫిక్‌తో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బయటకు వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలని అధికారులు సూచిస్తున్నారు.