: నంద్యాలలో దారుణం: ఘర్షణ పడుతున్న వారిని విడిపించేందుకు వెళ్లిన డాక్టర్ దారుణ హత్య


కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో గొడవపడుతున్న ఇద్దరిని విడిపించేందుకు వెళ్లిన ఓ వైద్యుడు దారుణ హత్యకు గురయ్యారు. సోమవారం రాత్రి బాగా పొద్దుపోయాక నంద్యాల శ్రీనివాస సెంటర్‌లో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారు. వారి ఘర్షణను చూసిన మహానంది మండలం గాజులపల్లి పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ శైలజానాథ్‌రెడ్డి అక్కడకు వెళ్లి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అంతే.. రెచ్చిపోయిన దుండగులు ఒక్కసారిగా డాక్టర్‌పై విరుచుకుపడ్డారు. రాళ్లతో ఇష్టానుసారం దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన వైద్యుడు శైలజానాథ్‌రెడ్డి రక్తపు మడుగులో కుప్పకూలిపోయారు. దీనిని గమనించిన కొందరు వెంటనే ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈ తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. వైద్యుడి మృతితో ఆయన కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైద్యుడి హత్య వెనుక ఎటువంటి పాత కక్షలు లేవని నంద్యాల డీఎస్పీ హరినాథరెడ్డి తెలిపారు.

  • Loading...

More Telugu News