: కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలంటూ ర్యాలీ, ధర్నా
కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించాలంటూ రాయచోటిలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత యువ సమాఖ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ, జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభించే అవకాశముందన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో పొందుపరిచారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని, కడప జిల్లాపై సీఎం చంద్రబాబు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాయలసీమలో ఎర్రచందనం, ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని వాటి ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు.