: స్థిరంగా దూసుకెళ్లి భారీ లాభాలు నమోదు చేసిన స్టాక్ మార్కెట్


సెషన్ ఆరంభంలో క్రితం ముగింపుతో పోలిస్తే 40 పాయింట్లకు పైగా నష్టంలో ఉన్న సెన్సెక్స్, ఆపై గంట వ్యవధిలోనే లాభాల్లోకి వచ్చి, మరేదశలోనూ వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి మంచి కొనుగోలు మద్దతు లభించిందని ట్రేడ్ అనలిస్టులు వ్యాఖ్యానించారు. ఒక దశలో నిఫ్టీ సూచిక 52 వారాల గరిష్ఠస్థాయికి చేరుకోవడం నేటి సెషన్ లో విశేషం. సెన్సెక్స్ సూచిక అత్యంత కీలకమైన 28 వేల పాయింట్ల స్థాయిని అధిగమించింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 292.10 పాయింట్లు పెరిగి 1.05 శాతం లాభంతో 28,095.34 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 94.45 పాయింట్లు పెరిగి 1.11 శాతం లాభంతో 8,635.65 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1 శాతం, స్మాల్ కాప్ 1.05 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 42 కంపెనీలు లాభపడ్డాయి. బీహెచ్ఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మారుతి సుజుకి, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, హిందాల్కో తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,911 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,724 కంపెనీలు లాభాలను, 990 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,08,03,091 కోట్లుగా నమోదైంది.

  • Loading...

More Telugu News