: ప్రియుడి మోసానికి గురైన యువతి అబార్షన్ కి అంగీకరించిన సుప్రీంకోర్టు
నిర్ణీత సమయం దాటాక అబార్షన్ చేయించుకున్నా లేక వైద్యులు చేసినా మన చట్టాలు ఒప్పుకోవు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే 24 నెలల గర్భం తొలిగించుకునేందుకు ఓ మహిళకు సుప్రీంకోర్టు అనుమతినివ్వడం ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... ముంబైకి చెందిన ఓ యువతి ఓ యువకుడి ప్రేమలో పడింది. అతను మాయమాటలతో నమ్మించి ఆమెను గర్భవతిని చేశాడు. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో తనపై అత్యాచారం చేశాడంటూ ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య ఆమె మానసికంగా నలిగిపోయింది. ఈ మానసిక ఆందోళన ప్రభావం ఆమె కడుపులోని పిండంపై చూపింది. దీంతో బిడ్డ ఎదుగుదల సరిగా లేదు. పిండంలో చాలా లోపాలున్నాయి. అలాంటి బిడ్డ భూమిమీదపడ్డా జీవనం నరకప్రాయం. దీంతో సమస్యకు పరిష్కారం కోసం ఆమె వివిధ ఆసుపత్రులను ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఆమె గర్భందాల్చి 24 వారాల వ్యవధి దాటింది. సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల లోపు మాత్రమే అబార్షన్ చేయడానికి వీలుంటుంది. దీంతో వైద్యులు ఆమె అబార్షన్ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారించిన న్యాయస్థానం అబార్షన్ చేయించుకునేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది.