: ఢిల్లీకి వచ్చాను కాబట్టి ప్రధానిని కలిశానంతే... కృష్ణా నీటిపై కేంద్రమే చూసుకుంటుంది: గవర్నర్ నరసింహన్
తాను ఢిల్లీకి వచ్చాను కాబట్టి మర్యాద పూర్వకంగా ప్రధాని నరేంద్ర మోదీని కలిశానని, అంతకన్నా మరే ఇతర కారణాలు లేవని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆయన మోదీతో సమావేశమైన అనంతరం, బయటకు వచ్చి మీడియాతో ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయారు. తెలుగు రాష్ట్రాల్లో శాంతి భద్రతలు బాగున్నాయని చెప్పిన నరసింహన్, కృష్ణా జలాల పంపిణీ విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. చర్చలతో లాభం లేదనుకుంటే కేంద్రం కల్పించుకుంటుందన్నారు. కాగా, నరసింహన్ మధ్యాహ్నం తరువాత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, ఆపై న్యాయ శాఖా మంత్రిని కలవనున్నారు. హైకోర్టు విభజనపై వీరితో చర్చించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.