: కొత్త బాస్ ను ప్రకటించిన 'ఐటీసీ'
సిగరెట్ ఉత్పత్తుల నుంచి ఆతిథ్య రంగం వరకూ పలు విభాగాల్లో విస్తరించిన దిగ్గజ సంస్థ 'ఐటీసీ'లో తదుపరి చైర్మన్ గా సంజీవ్ పూరిని నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అదే పదవిలో ఉన్న వైసీ దేవేశ్వర్, నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో సేవలందిస్తారని, ఆయన సేవలను మరో మూడేళ్ల పాటు వినియోగించుకుంటామని పేర్కొంది. ఈ విషయాన్ని ఓ ప్రకటన రూపంలో స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. హోల్ టైం డైరెక్టరుగా ఉన్న సంజీవ్ పూరిని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా నియమిస్తున్నామని, ఆయన నిమాయకం తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. కాగా, గత వారంలో దేవేశ్వర్ తన ఆఖరి వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన సంగతి తెలిసిందే. గడచిన జూన్ లోనే దేవేశ్వర్ పదవీ విరమణపై ఐటీసీ ప్రకటన వెలువరించింది. ఫిబ్రవరి 2017 నుంచి ఆయన వైదొలగుతారని తెలిపింది. 53 సంవత్సరాల సంజీవ్ పూరి ప్రస్తుతం ఐటీసీలోని ఎఫ్ఎంసీజీ విభాగాన్ని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకే తదుపరి సంస్థ బాధ్యతలు దక్కవచ్చని గతంలోనే వార్తలు వచ్చాయి. ఇక దేవేశ్వర్ పదవీ విరమణ చేసిన తరువాత సంజీవ్ కు చైర్మన్ పదవి దక్కుతుంది.