: ఆంధ్ర పాలకులు వాడిన భాషను ఇప్పుడు హరీశ్‌రావు వాడుతున్నారు: రేవంత్ రెడ్డి


మల్లన్నసాగర్ నిర్వాసితులపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు పట్ల టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం రైతులపై పాశ‌వికంగా వ్యవ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. మెద‌క్ జిల్లాలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. మ‌ల్ల‌న్నసాగ‌ర్ ప్రాజెక్టు అంశంపై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చేస్తోన్న‌ రైతుల ఉద్యమానికి తెలంగాణ‌లో అన్ని వర్గాల వారి నుంచి మ‌ద్ద‌తు ల‌భించింద‌ని పేర్కొన్నారు. రైతుల నుంచి బ‌ల‌వంతంగా భూములు లాక్కోవ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. నిర్వాసితుల‌కు జీవో 123 ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామనడం అన్యాయమ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. గ్రామాల్లో భూములున్న రైతులే కాదు, రైతు కూలీలు కూడా ఉన్నారని ప్ర‌భుత్వం వారికి అన్యాయం చేయొద్దని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌భుత్వం పోలీసుల‌ని న‌మ్ముకొనే పాల‌న చేస్తోంద‌ని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర పాలకులు ఉపయోగించిన భాషను హరీశ్‌రావు ఉపయోగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం మల్లన్నసాగర్‌ సమీపంలో నిర్మిస్తోన్న‌ పాములపర్తి రిజర్వాయర్‌ను 21 నుంచి 7 టీఎంసీలకు తగ్గించిన‌ప్పుడు మల్లన్నసాగర్‌ ముంపును ఎందుకు తగ్గించడం లేద‌ని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రైతుల ఇష్టంతోనే వారి భూములు తీసుకోవాలని, లేదంటే తాము వ‌చ్చేనెల‌ 13, 14న హైద‌రాబాద్‌లోని ఇందిరాపార్క్‌ దగ్గర దీక్షకు దిగుతామ‌ని ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News