: కృష్ణజింకల వేట కేసులో సల్మాన్ నిర్దోషి: తీర్పిచ్చిన రాజస్థాన్ హైకోర్టు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో కేసు నుంచి ఊరట పొందాడు. రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడి హతమార్చాడన్న కేసులో ఆయన్ను నిర్దోషిగా ప్రకటిస్తూ రాజస్థాన్ హైకోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పిచ్చింది. 1998 అక్టోబరులో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం రాజస్థాన్ అడవుల్లోకి వెళ్లిన సల్మాన్, హీరోయిన్లు సోనాలీ బింద్రే, టబు, నీలమ్ లతో కలసి కృష్ణ జింకలను వేటాడాడన్న అరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ మినహా మరెవరిపైనా ఆధారాలు లభ్యంకాకపోవడంతో జోథ్ పూర్ ట్రయల్ కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష విధించగా, దానిపై హైకోర్టు స్టే విధించింది. కేసును విచారించిన జస్టిస్ ముఖోపాధ్యాయ, జస్టిస్ గోయల్ లతో కూడిన ధర్మాసనం, సల్మాన్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని అభిప్రాయపడుతూ, ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.