: ‘పరామర్శ’కు వెళుతున్న జగన్ కు ఝలక్!... మంత్రి గంటాతో విశాఖ వైసీపీ కీలక నేత భేటీ!
ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతు నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు విశాఖకు వెళుతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసీపీ విశాఖ నగర శాఖలో కీలక నేతగా ఉన్న మాజీ డిప్యూటీ మేయర్ దొరబాబు నేటి ఉదయం టీడీపీ సీనియర్ నేత, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ అయ్యారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల నేపథ్యంలో విశాఖలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే దొరబాబు మంత్రి గంటాతో భేటీ అయినట్లు సమాచారం. వైసీపీని వీడి టీడీపీలో చేరతానని గంటా ముందు దొరబాబు ఓ ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అయితే ముందుగానే దొరబాబు టీడీపీ నేతలతో భేటీ అయ్యారని, టీడీపీలోకి మారే విషయంలోనూ ఆ పార్టీ నేతల నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారన్న ప్రచారం సాగుతోంది. విశాఖకు వస్తున్న వైఎస్ జగన్ కు ఝలక్కిచ్చేందుకే నేటి ఉదయం గంటాతో దొరబాబు భేటీ అయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.