: జర్నలిస్టుల దేశ బహిష్కరణ... పరిస్థితి తీవ్రంగా ఉంటుందని భారత్ ను హెచ్చరించిన చైనా!


చైనా అధికార వార్తా సంస్థ 'క్సిన్హువా'కు చెందిన ముగ్గురు జర్నలిస్టులను ఈ నెలాఖరులోగా దేశం విడిచిపోవాలని భారత్ ఆదేశించిన నేపథ్యంలో చైనా కటువు వ్యాఖ్యలు చేసింది. ముగ్గురు విలేకరులకు వీసాలను పొడిగించకుండా ఇండియా నిర్ణయించడాన్ని తప్పు పడుతూ, దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ప్రభుత్వ దినపత్రిక 'గ్లోబల్ టైమ్స్' వ్యాఖ్యానించింది. "అణు సరఫరాదారుల బృందంలో భారత్ చేరలేకపోయినందుకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్ఎస్జీ సభ్యత్వం విషయంలో భారత్ నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే, అంతే తరహాలో స్పందించాల్సి వుంటుంది. వీరి వీసా రెన్యువల్ తిరస్కరణకు ఎలాంటి అధికారిక కారణాలనూ వెల్లడించలేదు. వీరంతా ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లోని నిషేధిత ప్రాంతాల్లో తప్పుడు పేర్లతో పర్యటించారని ఇండియాలోని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రకటించాయి. టిబెటన్ విప్లవకారులతో మాట్లాడారన్న రిపోర్టులూ వచ్చాయి. ఏదిఏమైనా, భారత్ నిర్ణయం సరికాదు. ఇది తప్పుడు సంకేతాలు పంపుతోంది. రెండు దేశాల మధ్యా ఉన్న సమాచార సంబంధాలు తెగిపోయేలా చేస్తుంది" అని నేటి ఎడిటోరియల్ లో గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News