: నైజీరియా కిడ్నాపర్ల చేతిలో సాయి శ్రీనివాస్ పడిన నరకయాతన ఇది!


గత నెల 29వ తేదీన నైజీరియాలో కిడ్నాప్ నకు గురైన సీనియర్ ఇంజనీర్ సాయి శ్రీనివాస్ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. శ్రీనివాస్ ను విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఇరు దేశాల దౌత్యాధికారుల చొరవతో కిడ్నాపర్ల బారి నుంచి బయటపడ్డ ఆయన తనకు ఎదురైన అనుభవాలను, తాను పడ్డ నరకయాతనను స్వయంగా మీడియా ముందు వెల్లడించారు. "నా విడుదలకు కృషి చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ముఖ్యంగా భారత ప్రభుత్వానికి. మూడు వారాల పాటు నరకయాతన అనుభవించాను. ఆయుధాలతో వచ్చిన కిడ్నాపర్లు మేమున్న చోటు నుంచి బలవంతగా తీసుకువెళ్లారు. నైజీరియాలోని పలు అటవీ ప్రాంతాల్లో కిలోమీటర్ల కొద్దీ నడిపించారు. ఎప్పుడూ కళ్లకు గంతలు కట్టే ఉంచేవారు" అని అన్నారు. "కొన్నిసార్లు కారు డిక్కీలో పడేసి మరో ప్రాంతానికి తీసుకువెళ్లేవారు. తినేందుకు బ్రెడ్, నీరు తప్ప మరేమీ ఇచ్చేవారు కాదు. వారు ఎంత మొత్తం డబ్బును డిమాండ్ చేశారో తెలియదు. వారనుకున్న డబ్బు వారి చేతికి అందిన తరువాత మాత్రమే వదిలిపెట్టారు. ఓ ప్రదేశానికి తీసుకువచ్చి, కళ్లకు గంతలు తీయకుండా పరిగెత్తాలని చెప్పారు. గంతలు తీసినా, వెనుదిరిగి చూసినా కాల్చేస్తామని బెదిరించారు. కొంతదూరం పరిగెత్తి పడిపోయా. ఆపై గంతలు తీసి వెనుదిరిగి చూస్తే, కిడ్నాపర్లు కూడా పారిపోయారు. తనతో పాటు మరో ఇద్దరు ఇవే కష్టాలు అనుభవించారు" అని తెలిపారు. సాయి శ్రీనివాస్ రాకతో విశాఖపట్నంలో ఉంటున్న ఆయన కుటుంబ సభ్యుల్లో సంతోషం వెల్లివిరిసింది.

  • Loading...

More Telugu News