: 'హత్యా'చారమా?... ఆత్మహత్యా?: విశాఖలో కలకలం రేపుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని మృతి!
విశాఖపట్నంలో నిన్న ఓ కలకలం రేగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక తనూజ అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలిక తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన బాలిక తల్లిండ్రులు అర్ధరాత్రి దాకా వెదికి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు తనూజ కుటుంబం ఉంటున్న అపార్ట్ మెంట్ వెనుక భాగంలోని చెత్త కుప్పల్లో విగత జీవిగా పడి ఉన్న ఆ బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో తనూజతో సన్నిహితంగా మెలగుతున్న దిలీప్ అనే బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అతడికి సంబంధించిన మరో నలుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈవ్ టీజింగ్ ఆరోపణలపై తల్లితో వాగ్వాదం జరిగిన నేపథ్యంలో శనివారం రాత్రి 8.30 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తనూజ తెల్లారేసరికి శవమై కనిపించిన తీరు విశాఖలో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ కేసు మిస్టరీ పెను సవాలునే విసురుతోంది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందన్న వాదన వినిపిస్తున్నా, అందుకు సంబంధించిన ఆనవాళ్లు అక్కడ కనిపించడం లేదు. అంతేకాకుండా తనూజ శరీరంపై గాట్లు, గాయాలు కూడా ఉన్నాయి. దీంతో తనూజ హత్యాచారానికి గురైందా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న విషయాన్ని తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.