: ఒక్క పైసాతో రూ. 10 లక్షల బీమా... రైల్వే శాఖ నిర్ణయం
భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఒక్క పైసాకే రూ. 10 లక్షల బీమా సదుపాయాన్ని కల్పించనుంది. రైల్వే ప్రయాణికులకు ప్రమాద బీమా కల్పించేందుకు నిర్ణయించిన రైల్వే శాఖ, దాదాపు 15 బీమా కంపెనీలను వడపోసిన అనంతరం, రాయల్ సుందరం, ఐసీఐసీఐ లాంబార్డ్, శ్రీరామ్ జనరల్ లను ఎంపిక చేసింది. ఈ కంపెనీలతో చర్చలు తుది దశలో ఉన్నాయని, సెప్టెంబర్ మొదటి వారం నుంచి, రైల్వే టికెట్లు రిజర్వేషన్ చేయించుకునే ప్రయాణికులకు ప్రమాద బీమా అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు. సాధారణ తరగతి ప్రయాణికులు టికెట్ పై ఒక్క పైసా చెల్లించాల్సి వుంటుందని, రిజర్వేషన్ తరగతుల వారికి రూ. 5పై ఇదే బీమా సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు. అనుకోని సంఘటనలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా రూ. 10 లక్షల వరకూ బీమా డబ్బు పొందవచ్చని వెల్లడించింది. పూర్తి స్థాయి విధివిధానాలు ఖరారైతే, రిజర్వేషన్ ప్రయాణికుల బీమా ప్రీమియం మొత్తం ఇంకాస్త తగ్గుతుందని అంచనా. నిత్యమూ 2.30 కోట్ల మంది రైల్వేల్లో ప్రయాణిస్తుండగా, వీరిలో సాధారణ ప్రయాణికుల సంఖ్యే అధికం.