: ఒలింపిక్స్ కు ముందు పెను కలకలం... డోపింగ్ లో పట్టుబడిన కుస్తీ యోధుడు నర్సింగ్ యాదవ్
మరికొన్ని రోజుల్లో ఒలింపిక్స్ ఆటల పోటీలు రియోలో ప్రారంభం కానున్న వేళ, భారత క్రీడాకారుల్లో పెను కలకలం రేగింది. ప్రపంచ స్థాయి కుస్తీ పోటీల్లో కాంస్యం సాధించి, ఒలింపిక్స్ కు అర్హత సాధించిన ప్రముఖ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపింగ్ పరీక్షల్లో విఫలమయ్యాడు. ఆయన డోపీగా దొరికాడని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా డీజీ ప్రకటించారు. ఈ నెల 5న భారత క్రీడాప్రాధికార సంస్థ సాయ్ ఆధ్వర్యంలో ఒలింపిక్స్ కు వెళ్లే అథ్లెట్లందరికీ నాడా డోపింగ్ పరీక్షలు నిర్వహించింది. వీటి ఫలితాలు వెల్లడి కాగా, నర్సింగ్ యాదవ్ ఆయన నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్టు తేలింది. ఆయనకు రెండోసారి డోపింగ్ పరీక్షలు నిర్వహించగా, అప్పుడు కూడా అవే ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయన రియో ప్రయాణం దాదాపు నిలిచినట్టేనని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఒలింపిక్స్ కుస్తీ క్రీడాంశంలో 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ పోటీ పడాల్సివుంది. ఈ విభాగంలో పోటీ పడేందుకు తనకు అవకాశం ఇవ్వాలని మరో రెజ్లర్, ఒలింపియన్ సుశీల్ కుమార్ డిమాండ్ చేయగా, న్యాయ పోరాటం అనంతరం నర్సింగ్ కే అవకాశం దక్కిందన్న సంగతి తెలిసిందే.