: ఇండియన్ ఆయిల్ లో విలీనం కానున్న సీపీసీఎల్!
తన మాతృసంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (సీపీసీఎల్) విలీనం కానుందని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. చెన్నై సమీపంలోని మనాలిలో జరిగిన సీపీసీఎల్ రిఫైనరీ స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొని ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. తదుపరి దశలో ఐఓసీఎల్ గొడుగు కిందకు సీపీసీఎల్ వస్తుందని వెల్లడించారు. శక్తి ఉత్పాదన సంస్థలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్నదే కేంద్రం అభిమతమని చెప్పిన ధర్మేంద్ర ప్రధాన్, అందుకు కొన్ని సాంకేతికాంశాలు అడ్డు పడుతున్నాయని గుర్తు చేశారు. వాటాల పంపకం వంటి అంశాలు విలీనాలకు అడ్డంకులుగా మారుతున్నాయని అన్నారు. వీటిని పరిశీలించి, సమస్యలను పరిష్కరించిన మీదటే విలీనంపై ముందడుగు వేస్తామని అన్నారు. సీపీసీఎల్ లో 14 వాతం వాటా ఇరాన్ సంస్థకు ఉందని, విలీనం తరువాత, ఐఓసీలో ఆ కంపెనీకి ఎంత వాటా ఇవ్వాల్సి వస్తుందన్న విషయమై చర్చలు సాగుతున్నాయని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. విస్తరణ, అభివృద్ధి ప్రణాళికల అమలు కోసం ఇండియన్ ఆయిల్ సంస్థ ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వెచ్చించిందని తెలిపారు.