: 200 కొత్త సెంటర్లలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వనున్న టీసీఎస్ అయాన్!
అనతికాలంలోనే అపారమైన ప్రాచుర్యాన్ని పొందిన టీసీఎస్ అయాన్ ప్లాట్ ఫాంపై 2 లక్షల మందికి కొత్తగా ఉపాధి లభించనుందని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే అయాన్ ను రైల్వేలు, బ్యాంకులు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు వినియోగిస్తుండగా, మరో 200 కొత్త సెంటర్లలో అయాన్ సేవలు ప్రారంభమవుతాయని సంస్థ గ్లోబల్ హెడ్ వీ రామస్వామి వెల్లడించారు. చెన్నైలో అయాన్ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. టీసీఎస్ తన భవిష్యత్ వ్యూహంతో అయాన్ ను రూపొందించిందని ఆయన గుర్తు చేశారు. ఇకపై అయాన్ కేంద్రాలు విద్యా సంస్థలు, ఎగ్జామ్ బోర్డులకు తన క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్ తో సేవలను అందిస్తాయని ఆయన తెలిపారు. ఇప్పటికే చిన్న, మధ్య తరహా సంస్థలకు మరింత సాంకేతికతను దగ్గర చేశాయని అన్నారు. దీన్ని వాడటం ద్వారా భారత విద్యా వ్యవస్థలో పెను మార్పులు వస్తాయని, ఫలితాల వెల్లడికి సమయం మరింతగా తగ్గుతుందని, ఫలితాల్లో తప్పులకు అవకాశం ఉండదని రామస్వామి తెలిపారు. పలు ఐఐటీలు సహా ఎయిమ్స్, వేలూరులోని సీఎంసీల్లో అయాన్ ఆధారిత సొల్యూషన్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి విజయవంతమయ్యామని తెలిపారు. కొత్తగా ఏర్పాటయ్యే 200 కొత్త సెంటర్లలో 15 వరకూ ఇప్పటికే ఉన్న టీసీఎస్ ఆఫీసుల్లో ఉంటాయని, మిగతా వాటిని ఔత్సాహికులకు అప్పగించి నడిపిస్తామని తెలిపారు. ఈ సెంటర్ల కోసం ఎంత వెచ్చించనున్నామన్న విషయాన్ని వెల్లడించేందుకు ఆయన నిరాకరిస్తూ, 250 కంప్యూటర్లతో సెంటర్ ఏర్పాటు చేయాలంటే కోటి రూపాయల వరకూ ఖర్చవుతుందని తెలిపారు. దీన్ని వాడితే పరీక్షలు రాసిన రోజునే ఫలితాలు వెల్లడించ వచ్చని రామస్వామి వెల్లడించారు. దీన్ని బిజినెస్ యూనిట్ గా కాకుండా, ప్రజలకు మరింతగా ఉపకరించే సాంకేతిక ఆస్త్రంగా భావిస్తున్నట్టు తెలిపారు.