: తాత్కాలిక సచివాలయంలో టాయ్ లెట్లు లేవు... ఆ అవసరం కోసం విజయవాడ వెళ్లిన అధికారి!
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి సమీపంలో ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ కనీస అవసరాలను తీర్చుకునేందుకు టాయ్ లెట్లు కూడా లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ పనిచేసేందుకు వెళ్లిన దాదాపు 50 మంది ఉద్యోగులు అక్కడ ఏ సౌకర్యాలూ లేవని ఆరోపిస్తూ, వెను దిరిగారని తెలుస్తోంది. మరో అధికారి రెస్ట్ రూమ్ కోసం కారులో విజయవాడ వరకూ వెళ్లాల్సి వచ్చిందట. తాత్కాలిక సచివాలయ నిర్మాణం డెడ్ లైన్ ఏడవ సారి కూడా మిస్ అయిందని పత్రికల్లో కథనాలు వచ్చాయి. విద్యుత్ సరఫరా పనులు పూర్తి కాలేదని, సరైన సదుపాయాలు లేకుండా ప్రభుత్వం ఉద్యోగుల తరలింపు పేరిట హడావుడి చేస్తోందంటూ, ఓ ఆంగ్ల పత్రిక 'నో టాయిలెట్స్ గురూ' అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అన్ని సౌకర్యాలూ ఏర్పాటయ్యే వరకూ అక్కడ మరే కొత్త విభాగం ప్రారంభం కాకపోవచ్చని అధికారులు అంటున్నారు.