: పారా మిలటరీ దళాలకు బులెట్ ప్రూఫ్ హెల్మెట్లు


భారతదేశ చరిత్రలో తొలిసారిగా పారా మిలటరీ దళాలకు హైటెక్ బులెట్ ప్రూఫ్ హెల్మెట్లను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వారికి పూర్తి రక్షణాత్మక హెల్మెట్లను అందిస్తామని, ఇవి 7.62, 9 ఎంఎం బులెట్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయని, 20 మీటర్ల దూరం నుంచి వారి తలల్లోకి కాల్చినా ఏమీ కాదని అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మావోయిస్టులతో పోరాడుతున్న, సరిహద్దుల్లో కాపలా కాస్తున్న వారికి, జమ్మూ కాశ్మీర్ లో అల్లరి మూకల రాళ్ల దాడులకు ఎదురొడ్డి శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడుతున్న 10 లక్షల మందికి వీటిని అందిస్తామని వీటి బరువు 1.5 నుంచి 2 కిలోల లోపే ఉంటుందని తెలిపారు. అమెరికా సైన్యం ఈ తరహా హెల్మెట్లను వాడుతోందని వెల్లడించిన అధికారులు, భారత దళాలకు సరికొత్త హెల్మెట్ల సరఫరా దస్త్రంపై హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతకం పెట్టారని వివరించారు. జవాన్ల తలలను బులెట్ తూటాల నుంచి కాపాడటంతో పాటు, రాళ్ల దాడుల నుంచి వారిని రక్షించేందుకు ఇవి ఉపకరిస్తాయని అన్నారు. వాకీ టాకీలు, నైట్ విజన్ కెమెరాలు, టార్చీలు తదితరాలకు తగిలించుకునేలా హెల్మెట్లు ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం 3.5 లక్షల మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో విధులు నిర్వహిస్తుండగా, వారి వద్ద కేవలం 2 వేల బులెట్ ప్రూఫ్ హెడ్ గేర్లు మాత్రమే ఉన్నాయి. 2.5 లక్షల మంది బీఎస్ఎఫ్ లో పనిచేస్తుండగా, కేవలం 500 బులెట్ ప్రూఫ్ హెల్మెట్లు మాత్రమే ఉన్నాయి. పారా మిలటరీ దళాలకు 98 శాతం బులెట్ ఫ్రూఫ్ హెల్మెట్ల కొరత ఉందని, ఇవి కొనాలంటే నిధుల లేమి ఇంతకాలం బాధించిందని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News