: మిస్సింగ్ విమానం... 50 నుంచి 20 శాతానికి తగ్గిన అవకాశం!


మూడు రోజుల నాడు బంగాళాఖాతంలో మాయమైన భారత వాయుసేన విమానం ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలు గంటగంటకూ తగ్గుతున్నాయి. గతంలో సముద్రంలో కుప్పకూలిన విమానాల్లో జాడ తెలియనివే అధికం. ఆ తరహాలోనే ఈ విమానం కూడా తెలియకుండా పోయే అవకాశాలే ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 5 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విమానం శకలాల కోసం సెర్చింగ్ సాగుతుండగా, జాడ తెలిసే అవకాశాలు 50 శాతం ఉన్నాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్ కాయిస్) చెబుతోంది. ఇక ఈ విస్తీర్ణాన్ని 9 వేల కిలోమీటర్లకు పెంచాలని నిర్ణయించడంతో, విమానం ఆచూకీ తెలిసే అవకాశం 20 శాతానికి పడిపోయిందని ఓ అధికారి తెలిపారు. మరోవైపు గంటలు గడిచే కొద్దీ, విమానంలో బ్యాటరీలు పాడైపోయి, ఎటువంటి సిగ్నల్స్ వెలువడని పరిస్థితి సంభవిస్తే, దాని జాడ ఇక ఎన్నటికీ తెలిసే అవకాశం ఉండదని అధికారులు తెలిపారు. శనివారం నాటికి 13 నౌకలు, రాత్రిపూట స్పష్టంగా చూపించగల కెమెరాల సదుపాయమున్న రెండు పీ8ఐ సహా ఐదు విమానాలు సోదాల్లో పాల్గొంటుండగా, ఏఎన్-32, రెండు సీ-130లతో పాటు ఎంఐ-17 హెలికాప్టర్లు ఈ ఉదయం రంగంలోకి దిగాయి. చెన్నై తీరం నుంచి 217 కిలోమీటర్ల దూరంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సాగుతోందని ఇన్ కాయిస్ హెడ్ టీఎం బాలకృష్ణన్ నాయర్ వెల్లడించారు. విమానం అదృశ్యమైన ప్రాంతం నుంచి 25 కిలోమీటర్ల పరిధిలో నౌకలు జల్లెడ పడుతున్నాయని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News