: నేడు లష్కర్ బోనాలు... అమ్మకు బోనం ఇచ్చేందుకు కదిలిన కేసీఆర్ కుటుంబం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుఝాము నుంచే భక్తులు అమ్మ దర్శనం కోసం క్యూ కట్టారు. 4 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో సహా దేవాలయానికి వచ్చి, అమ్మవారికి తొలి బోనం సమర్పించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ వాసులంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ తన కుటుంబంతో వచ్చి మహంకాళికి పట్టుచీర, పసుపు, కుంకుమలతో బోనాలను సమర్పించేందుకు బయలుదేరారు. 8 గంటల తరువాత కేసీఆర్ ఆలయానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. భక్తుల భద్రత నిమిత్తం 100కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, నిఘాను పటిష్ఠం చేశామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. నేటి రాత్రి 8 గంటల నుంచి పలహారపు బండ్ల ఊరేగింపులు ప్రారంభం కానుండగా, రేపు ఉదయం 9 గంటల తరువాత మాతంగి స్వర్ణలత రంగం నిర్వహించి భవిష్యవాణిని వినిపించనున్నారు.