: కేవీపీ బిల్లు ఓటింగ్‌కు రాకపోవడానికి మేము కారణమా?: రఘువీరా ఆగ్రహం
ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రయివేటు బిల్లు ఓటింగ్‌కు రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలే కారణమంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవీపీ బిల్లు పెట్టిన నేపథ్యంలో తాను నాలుగు రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నానని, బీజేపీ, టీడీపీలు కలసి బిల్లును అడ్డుకుంటాయని తాను మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉన్నానని, అయినా చివరికి అదే జరిగిందని అన్నారు. బిల్లు ఓటింగ్‌కు రాకపోవడానికి బీజేపీ, టీడీపీ నేతలే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. బిల్లుని అడ్డుకుంటామని ఎంపీ కంభంపాటి హరిబాబు ముందే ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. హోదా కోసం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రయత్నాలు కొనసాగిస్తోందని, టీడీపీ రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో పూర్తిగా విఫలమయిందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి ఎన్నో విషయాల పట్ల టీడీపీ నేతల అసమర్థత కనిపించిందని రఘువీరా వ్యాఖ్యానించారు. ‘మేము హోదా అంటూ రాజకీయం చేస్తున్నామని అంటున్నారు. ఇప్పుడేమయినా ఎన్నికలున్నాయా, రాజకీయం చేయడానికి? బిల్లు ఓటింగ్ కి రాకపోవడానికి కారణం మేమా?' అని ఆయన ప్రశ్నించారు. ‘మీరు వైఫల్యం చెందారు కాబట్టే మేము పోరాడుతున్నాం’ అని రఘువీరా అన్నారు. ‘రాష్ట్రానికి సంబంధం లేని తొమ్మిది పార్టీలు కేవీపీ బిల్లుకి సహకరించాయి కానీ టీడీపీ, బీజేపీ ఎందుకు సహకరించలేదు?’ అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి ఎందుకు రాలేదని ఆయన అడిగారు. కేసులకు భయపడే ఆయన రాలేదని రఘువీరా అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి హోదా బిల్లుని విమర్శించడమేంటని దుయ్యబట్టారు.