: డబుల్ సెంచరీ చేయడానికి గల కారణాన్ని వివరించిన కోహ్లీ
వెస్టిండీస్తో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ కోహ్లీ అద్భుతంగా రాణించి విదేశాల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, తాను చెలరేగి డబుల్ సెంచరీ చేయడానికి గల కారణాన్ని కోహ్లీ వెల్లడించాడు. ఒత్తిడి కారణంగానే తాను అద్భుతమయిన ఇన్నింగ్స్ ఆడానని ఆయన పేర్కొన్నాడు. ఒత్తిడే తనకు శక్తినిస్తోందని తెలిపాడు. ‘వెస్టిండీస్ లో రాణించలేనని నాపై విమర్శలు వస్తున్నాయి. కానీ నా అభిమానులు నేనిక్కడ రాణించాలని కోరుకుంటున్నారు. ఆ ఒత్తిడినే నా ఆశీర్వాదంగా తలచి అద్భుతమయిన ఆటతీరు కనబరిచా’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ‘ఐదేళ్ల క్రితం ఇక్కడ మూడు టెస్టులాడాను. అయితే అప్పుడు 76 పరుగులు మాత్రమే చేయగలిగాను. అది నన్ను నిరాశలోకి నెట్టింది. ఈసారైనా నా అభిమానులు నేను ఇక్కడ మెరుగైన ఆటతీరు కనబర్చాలని కోరుకుంటున్నారు. చివరికి అది సాధ్యమైంది’ అని కోహ్లీ అన్నాడు. సెంచరీనే నమోదు చేయని వెస్టిండీస్‌లో ఒకేసారి డబుల్ సెంచరీ చేశానని, ఈ సిరీస్ తనకెప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తుందని కోహ్లీ పేర్కొన్నాడు. తాను క్రీజులో ఉన్నప్పుడు కూల్‌గా ఉండాలని భావిస్తుంటాడని ఆయన తెలిపాడు.