: భాగ్యనగరి ఉగ్ర కుట్రకు కేరెల్లిలో బీజం!... ఎన్ఐఏ సోదాలతో ఉలిక్కిపడ్డ రంగారెడ్డి జిల్లా గ్రామం!


భాగ్యనగరి హైదరాబాదు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో పెను విధ్వంసానికి కుట్ర పన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు చివరి క్షణంలో అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ మెరుపు దాడులతో ఉగ్ర కుట్ర భగ్నమైనా... హైదరాబాదును చుట్టి ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందిన కేరెల్లి గ్రామం భయాందోళనకు గురైంది. వివరాల్లోకెళితే... భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించిన ఉగ్రవాదులు నగర శివారులోని అనంతగిరిలో ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారన్న వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. పాత బస్తీలో షెల్టర్ ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదుల పన్నాగానికి రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం కేరెల్లిలోనే బీజం పడిందట. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కేరెల్లిని సేఫ్ జోన్ గా భావించిన ఉగ్రవాదులు ఐదు రోజుల పాటు ఆ గ్రామంలోనే బస చేశారట. గ్రామంలోని మసీదు నిర్వాహకులు గోరేమియా, మొయిన్ ల ఇళ్లలో ఆశ్రయం పొందారట. ఈ విషయం నిన్నటిదాకా బయటకు పొక్కకున్నా... నిన్న ఎన్ఐఏ అధికారులు గ్రామంలో సోదాలు చేయడంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. సోదాలెందుకని ప్రశ్నించిన గ్రామస్తులు అసలు విషయం తెలుసుకుని మసీదు నిర్వాహకులను నిలదీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా చెప్పుకున్నందునే వారికి తాము ఆశ్రయమిచ్చినట్లు గోరేమియా, మొయిన్ లు గ్రామస్తులకు చెప్పారు. గ్రామంలో బస చేసిన సమయంలో మసీదు వెనుకాల ఉన్న గదిలో చర్చలు నిర్వహించిన ఉగ్రవాదులు... అనంతగిరి అడవుల్లోనే ఫైరింగ్ ప్రాక్టీస్ చేసిన విషయాలను గుర్తుకు చేసుకుని గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

  • Loading...

More Telugu News