: రెండో పట్టిసీమ ఖర్చు రూ.1,300 కోట్లట!... జూన్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా కసరత్తు!


రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో అధికారం చేపట్టిన వెంటనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సాగు నీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేందుకు చాలా సమయమే పడుతుందన్న సమాచారం నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం వద్ద పట్టిసీమ పేరిట ఓ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. రికార్డు సమయంలో సదరు ప్రాజెక్టును పూర్తి చేయించిన చంద్రబాబు... గోదావరి నీటిని కృష్ణా నదిలో కలిపి దేశంలోనే మొదటిసారిగా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగానే ఆ ప్రాజెక్టు కుడి కాలువపై నిర్మించిన పట్టిసీమ టీడీపీ ప్రభుత్వానికి మంచి విజయమేనని చెప్పొచ్చు. తాజాగా పోలవరం ప్రాజెక్టునే ఆధారంగా చేసుకుని మరో పట్టిసీమ నిర్మాణానికి చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. పోలవరం ఎడమ కాలువపై తూర్పు గోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద పట్టిసీమ తరహాలోనే మరో ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో అక్కడ పర్యటించిన ఇంజనీరింగ్ అధికారులు ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1,300 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏలేరు రిజర్వాయర్ లోని నీటి మళ్లింపునకు ఓ ఎత్తిపోతల పథకం, మళ్లీ అక్కడి నుంచి ఏలేరు ఆయకట్టుకు సాగు నీరు, విశాఖకు తాగు నీరు అందించేందుకు మరో ఎత్తిపోతలను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి ఏలేరు రిజర్వాయర్ లోకి నీటిని తోడటానికి ఏర్పాటు చేయనున్న ఎత్తిపోతలకు రూ.1,000 కోట్లు, ఏలేరు నుంచి నీటిని తోడిపోసేందుకు ఏర్పాటు చేయనున్న రెండో ఎత్తిపోతలకు రూ.300 కోట్లు ఖర్చవుతుందన్న అంచనాలను పరిశీలించిన ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దీనిపై సర్వే చేపట్టి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను రూపొందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును కూడా పట్టిసీమ మాదిరే అతి తక్కువ కాలంలోనే నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే ఏడాది జూన్ ఆఖరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు డెడ్ లైన్ విధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News