: డిపాజిట్ కడితే వేలం మొదలెడతారట!... సదావర్తి భూముల వేలంపై ఏపీ సర్కారు వింత పోకడ!


విమర్శల జడివాన కురిసిన సదావర్తి సత్రం భూముల వేలానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకుంది. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కేవలం రూ.22.44 కోట్లకు వేలం వేసిన ఏపీ దేవాదాయ శాఖ తీరుపై విపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు భగ్గుమన్నాయి. అధికార పార్టీ నేతలు చక్రం తిప్పిన కారణంగానే సదావర్తి భూములు తక్కువ ధరకు విక్రయమైపోయాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో హైదరాబాదులోని బంజారాహిల్స్ కు చెందిన ‘పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ ఏపీ దేవాదాయ శాఖకు ఓ లేఖ రాసింది. వేలంలో దక్కిన ధర కంటే 25 శాతం ... అంటే రూ.5.61 కోట్లను అధికంగా చెల్లిస్తానని, తనకే ఆ భూములు విక్రయించాలని ఆ లేఖలో పేర్కొంది. అప్పటికే వేలంపై విమర్శలు రేకెత్తిన నేపథ్యంలో పీఎల్ఆర్ లేఖకు దేవాదాయ శాఖ వినూత్నంగా స్పందించింది. వేలంలో దక్కిన ధరతో పాటు లేఖలో పేర్కొన్నట్లు అధిక ధరను డీడీ రూపంలో డిపాజిట్ చేస్తే... సదరు భూములకు రెండో దఫా వేలం నిర్వహిస్తామని దేవాదాయ శాఖ చెప్పింది. ఈ మేరకు కొంగొత్త ప్రతిపాదనను ఆఫర్ చేస్తూ ఆ శాఖ పీఎల్ఆర్ సంస్థకు ప్రత్యుత్తరం రాసింది. ఈ లేఖలో దేవాదాయ శాఖ మరో ట్విస్ట్ పెట్టింది. రెండో దఫా జరపనున్న వేలంలో పీఎల్ఆర్ కంపెనీ ప్రతిపాదించిన ధర కంటే అధిక ధరను ఎవరైనా కోట్ చేస్తే... వారికే ఆ భూములను ఇస్తారట. పీఎల్ఆర్ కంటే అధిక ధర రాని పక్షంలోనే ఆ సంస్థకు ఈ భూములను రాసిస్తామని ఆ శాఖ విచిత్రమైన నిబంధన పెట్టింది.

  • Loading...

More Telugu News