: స్వర్ణ బార్ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు!... మద్యంలో సైనైడ్ ఉందన్న ఫోరెన్సిక్ నివేదిక!


విజయవాడ నగరంలోని కృష్ణలంకలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ బార్ లో చోటుచేసుకున్న కల్తీ మద్యం ఘటనకు సంబంధించి సరికొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మద్యంలోని సైనైడ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ఫోరెన్సిక్ నివేదిక తేల్చేసింది. గతేడాది డిసెంబర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనలో... స్వర్ణ బార్ లో మద్యం కొనుగోలు చేసి సేవించిన వారిలో ఏడుగురు మరణించగా, 25 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనను సీరియస్ గా పరిగణించిన ఏపీ సర్కారు సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. బార్ యాజమానులుగా మల్లాది విష్ణు కుటుంబ సభ్యులందరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనకు అసలు కారణమేమిటన్న విషయాన్ని నిగ్గుతేల్చాలని సీఐడీ అధికారులు హైదరాబాదులోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీని కోరారు. ఈ మేరకు బార్ లో సేకరించిన 30 మద్యం శాంపిళ్లను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. వీటిని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు ఏకంగా 26 శాంపిళ్లలో సైనైడ్ ఉన్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు ఏపీ సీఐడీ అధికారులకు నివేదిక కూడా పంపారు. మద్యంలో సైనైడ్ ఉందన్న విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. శ్రీలంక, లిబియా వంటి దేశాల్లో మాత్రమే కనిపించే ఈ విష గుళికలు విజయవాడకు ఎలా వచ్చాయి? ఎవరు తెస్తున్నారు? అన్న విషయాలను పరిశీలించే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే... రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా స్వర్ణ బార్ లో విక్రయించిన మద్యంలోనే సైనైడ్ ఎలా వచ్చి చేరిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు మల్లాది విష్ణు చుట్టూ ఉచ్చును మరింతగా బిగిస్తున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News