: యుద్ధానికి సిద్ధంగా ఉండండి: సైనికులకు చైనా ఆదేశాలు
ప్రపంచంపై యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో దక్షిణ చైనా సముద్రంపై చారిత్రక హక్కును కోల్పోయి, ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న చైనా యుద్ధానికి సై అంటోంది. ఐక్యరాజ్య సమితి కోర్టు తీర్పుకు కారణమైన ఫిలిఫ్పీన్స్, ఇతర ద్వీపదేశాలతో కయ్యానికి చైనా కాలుదువ్వుతోంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున విధ్వంసక ఆయుధాలు, క్షిపణులను మోహరించి, సర్వసన్నద్ధమవుతోంది. ఈ మేరకు చైనా సైన్యం చేపట్టిన చర్యలను అక్కడి అధికారిక ఛానెల్ లో ప్రసారం చేసింది. అంతటితో ఆగని చైనా తన దేశ సైన్యానికి 'యుద్ధానికి సన్నద్ధులు కండి' అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఏ క్షణమైనా ఉత్పాతాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 1500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగే అత్యాధునిక మిస్సైళ్లు, 70 ఏళ్లుగా చైనీస్ ఆర్మీలో కీలక ఆయుధం డీఎఫ్-16 క్షిపణులను, ఇతర అత్యాధునిక ఆయుధ సంపత్తిని దక్షిణ చైనా సముద్ర స్థావరంలో మోహరించింది. ఈ స్థావరాన్ని జిన్ పింగ్ తరువాతి స్థాయి గల సెంట్రల్ మిలటరీ కమిషన్ ఉపాధ్యక్షుడు జనరల్ ఫాన్ చాంగ్ లాంగ్ సందర్శించి, సైనికుల్లో ఆత్మస్థైర్యం నింపారు. చైనా సర్వసన్నద్ధమవుతున్న వేళ ఫిలిప్పీన్స్, ఇతర ద్వీపాల తరపున రంగంలోకి దిగేందుకు అమెరికా అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఫిలిఫీన్స్ సమీపంలోని యూఎస్ ఎయిర్ బేస్ (క్లార్క్ బేస్) నుంచి ఆయుధాలు సరఫరా అవుతున్నాయి. ఇదే సమయంలో చైనా సైనికుల దూకుడును అడ్డుకునేందుకు భారత్ తన సరిహద్దులో అత్యాధునిక యుద్ధ ట్యాంకులను మొహరించింది. ఇక్కడ రెండు దేశాల సరిహద్దుల వద్ద ప్రతి పది అడుగులకు ఒక సైనికుడు పహారా కాస్తున్నాడంటే రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమని ప్రకటనలు చేసుకుంటున్నట్టేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుండగా, దేశ సరిహద్దుల్లో కాపలాకు ఆ చర్యలు తీసుకుంటున్నామని రెండు దేశాలు ప్రకటిస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారంలో చైనా ఫిలిఫ్పీన్స్, ఇతర ద్వీపాలపై దురాక్రమణకు దిగితే... ఆ దేశాలకు అమెరికా దన్నుగా నిలుస్తుందా? లేక తనకెందుకు, అని తప్పుకుంటుందా? అన్నదానిపై చర్చ జరుగుతోంది.