: ఇందిరను హత్య చేస్తారన్న విషయం ఒక్క వ్యక్తికి ముందుగానే తెలుసు!: బ్రిటన్ డాక్యుమెంట్ వెల్లడి
ఐరన్ లేడీ దివంగత ఇందిరా గాంధీ హత్యోదంతానికి సంబంధించిన ఒక సంచలన విషయం వెలుగు చూసింది. ఇందిరా గాంధీ హత్యకు గురవుతారన్న విషయం 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' సంస్థ అధినేత జగ్జీత్ సింగ్ చౌహాన్ కు ముందే తెలుసని బ్రిటన్ విడుదల చేసిన డాక్యుమెంట్ ద్వారా తెలుస్తోంది. యూకేలో ఉంటూ జగ్జీత్ సింగ్ చౌహన్ చేసే సంచలన ప్రకటనలు బ్రిటన్, భారత్ మధ్యనున్న ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపేవని ఈ డాక్యుమెంట్ల ద్వారా బయటపడింది. దీంతో భారత ప్రభుత్వం ఫిర్యాదు మేరకు అప్పటి బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ అతనిపై చర్యలకు ఉపక్రమించారని డాక్యుమెంట్స్ తెలిపాయి. ఈ డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైన ఇంకో విషయం ఏంటంటే... ఇందిరా గాంధీతోపాటు ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ కూడా మరణిస్తాడని చౌహాన్ విచారణాధికారులకు తెలిపాడని ఈ డాక్యుమెంట్స్ స్పష్టం చేశాయి. పంజాబ్ లో పుట్టి పెరిగిన జగ్జీత్ సింగ్ చౌహాన్ వైద్యవిద్య పట్టభద్రుడు. డాక్టర్ గా సేవలందించిన ఆయన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. పంజాబ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గానూ పనిచేసిన చౌహాన్, 1971లో లండన్ కు వలసవెళ్లారు. అక్కడ ఉంటూనే 'సిఖ్ రిపబ్లిక్ ఆఫ్ ఖలిస్తాన్' సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా ఖలిస్థాన్ ఉద్యమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఖలిస్థాన్ కోసం పాక్, అమెరికా, కెనడాల మద్దతు కూడగట్టేందుకు ఆయన విఫలయత్నం చేశారు. 2001లో ఇండియాకు తిరిగొచ్చి 'ఖల్సా రాజ్' పార్టీని స్థాపించారు. ఆ పార్టీ జనాదరణ పొందలేకపోయింది. 2007లో 78 ఏళ్ల వయసులో చౌహాన్ మరణించారు.