: ఒక మహిళను చెట్టెక్కించిన ‘పోకెమాన్’... కిందకు దిగలేక నానా అవస్థలు!
ఇటీవల ట్రెండ్ గా మారిన ‘పోకెమాన్’ మొబైల్ గేమ్ ఆడుతూ ప్రమాదాల బారిన పడ్డవారి గురించిన ఎన్నో సంఘటనలను మనం చూస్తున్నాం. తాజాగా, అమెరికాలోని న్యూజెర్సీలో ‘పోకెమాన్’ గేమ్ ఆడుతున్న ఒక మహిళ... ఆట క్రమంలో క్లార్క్స్ బోరోలోని ఒక శ్మశానంలోకి వెళ్లింది. అక్కడున్న ఒక చెట్టుపై పోకెమాన్ ఉన్నట్లు తెలియడంతో ఆ చెట్టెక్కేసింది. అక్కడ వరకు బాగానే ఉంది, ఆ తర్వాతే ఆమెకు ఇబ్బంది వచ్చి పడింది. ఆ చెట్టు మీద నుంచి దిగడం ఆమె వల్ల కాలేదు. చివరికి చేసేదేమీలేక అత్యవసర నంబర్ కు ఫోన్ చేసింది. తూర్పు గ్రీన్ విచ్ టౌన్ షిప్ ఫైర్, రెస్క్యూ టీం అక్కడకు చేరుకుని నిచ్చెన వేయడంతో ఆమెకు కిందకు దిగింది. ఈ విషయాన్ని ఫైర్ డిపార్ట్ మెంట్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఈ పోస్ట్ ద్వారా ‘పోకెమాన్’ ఆడేవాళ్లను సదరు అధికారులు హెచ్చరించారు. ఆట ఆడేటప్పుడు ఎటు వెళ్తున్నామో, ఏం చేస్తున్నామనే విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.