: టీడీపీ, బీజేపీ నాటకాలాడుతున్నాయి: సినీ నటుడు శివాజీ
టీడీపీ, బీజేపీలు నాటకాలాడుతున్నాయని ఏపీ ప్రత్యేకహోదా సాధన సమితి నేత, సినీ నటుడు శివాజీ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో జరిగిన తతంగాన్ని రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ ప్రయోజనాల కంటే ముందు కేంద్ర ప్రయోజనాలను పట్టించుకోవడం సిగ్గుచేటని అన్నారు. సోమవారం బిల్లును కాంగ్రెస్, టీడీపీ కలిసి ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా బిల్లును 14వ బిల్లుగా ప్రవేశపెట్టి తొక్కేద్దామని చూశారని ఆయన మండిపడ్డారు. చేసిన తప్పు తెలుసుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కాంగ్రెస్ పట్టుబడితే దానిని తప్పుబట్టడం సిగ్గుచేటని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఇవేవీ తెలియదని, వారేమీ చూడరని, తామేం చెప్పినా, చేసినా చెల్లుబాటవుతుందని భావించడం సరికాదని, రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సుజనా చౌదరి బీజేపీలో చేరి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ దోషిగా నిలబడిందని ఆయన చెప్పారు. బిల్లుల వరుస క్రమం మారితే వచ్చిన నష్టం ఏంటి? అని ఆయన నిలదీశారు. కేంద్రానికి అవసరమైన బిల్లులను ముందుగాను, ప్రజలకు అవసరమైన బిల్లులను ఆ తరువాత ఓటింగ్ కు పెట్టాల్సిన అవసరం ఏంటని ఆయన నిలదీశారు.