: జిల్లాల మధ్య చిచ్చుపెట్టి రైతులను రెచ్చగొట్టాలని చూశారు: సీఎం చంద్రబాబు
తమ ప్రభుత్వం చేపట్టిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్కువ వ్యవధిలోనే పూర్తి చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు విజయవాడలో ఆయన టీడీపీ నేతలతో కలిసి కృష్ణాడెల్టా ప్రజాప్రతినిధులు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రైతులకు రుణమాఫీ చేసి వారిని ఆదుకున్నామని ఆయన అన్నారు. వర్షాలతో తడిసిన పంటలను, రంగుమారిన పంటలను గతంలో సర్కారు కొని రైతులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడా అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అనుకున్న గడువులోనే పట్టిసీమని పూర్తి చేసి కృష్ణా డెల్టా రైతులకు నీరందించామని చంద్రబాబు అన్నారు. నదుల అనుసంధానం జరగబోదంటూ పలువురు విమర్శలు గుప్పించారని, జిల్లాల మధ్య చిచ్చుపెట్టి రైతులను రెచ్చగొట్టాలని చూశారని అన్నారు. అందుకోసం కోర్టులో కేసులు కూడా వేశారని, అయినప్పటికీ రైతులకు నీరందించామని ఆయన అన్నారు. ప్రతి రైతు పంటలు బాగా పండించి ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రైతులకు వచ్చే రాబడి పెరగాలని ఆయన అన్నారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉండాలని ఆయన పేర్కొన్నారు.